సూర్య ప్రభా, దుండిగల్: క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం
బలైన విషాద ఘటన దుండిగల్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలోని ఇటుక బట్టీల్లో చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వాగ్మూరి గుణాజీ (51) కుటుంబ సభ్యులతో కలిసి బహదూర్‌పల్లిలో నివాసం ఉంటూ, దుండిగల్ తాండా-2కు చెందిన కొర్ర నగేష్ ఇటుక బట్టీల్లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. రోజువారీ పని ముగించుకున్న అనంతరం గుణాజీ ఇటుక బట్టీల మధ్యలోనే నిద్రపోయాడు. సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో క్రేన్ సహాయంతో ఇటుకలు తరలిస్తున్న డ్రైవర్, అక్కడ నిద్రిస్తున్న గుణాజీని గుర్తించకుండా క్రేన్‌ను అతనిపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో అతని తొడ కండరాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే గుణాజీ అక్కడే నిద్రిస్తాడనే విషయం తెలిసినా డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. జీవనోపాధి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్ద మృతి చెందడంతో భార్యతో పాటు ఏడుగురు పిల్లలు ఆధారంలేని స్థితిలోకి వెళ్లిపోయారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన యజమాని కొర్ర నగేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గుణాజీ దాదాపు 20 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ యజమాని స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగగా, పోలీసులు వారిని సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి. సతీష్ తెలిపారు.